Sunday, January 27, 2013

Nalla Tambi-55/56


మాంగల్యబంధంతో ఒక్కటై ఏడు అడుగులు నడిచినమ్దుకే మహోన్నతుడి ఆదర్శాలకు ప్రభావితమై అతని నిష్క్రమణతో పసుపు కుంకుమలను విడనాడి...మిగిలిన జీవితాన్ని అతని ఆశయ సాధనకు అంకితమైపోయిన చందన మోముపై నిష్కల్మషమైన ఆనందహేల.

    గతించిన గతానికన్నా వాస్తవం ఆమెను మరింత ప్రభావితం చేసింది.

    అతని నిష్కల్మషమయిన త్యాగంవలన దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన అనాధ బాల బాలికలకోసం మహోన్నతమయిన ప్రాజెక్ట్ ని, ఇరవై ఐదేళ్ళ గడ్డుకాలంలో అతను ప్రారంభించిన భవన నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాకుండా వేలకు వేలుగా అనాథ బాల బాలికలను తీర్చిదిద్ది ఉత్తమ పౌరులను చేయడంలో చందన కృషి ఫలించింది.

    తమ అన్న ప్రాణాలతోనే ఉన్నాడనీ...తను చేసినా నేరాలకు స్వచ్చందంగా పోలీసులకు లొంగిపోయిన విషయం వినడంలో ఉప్పెనలా వచ్చి అన్నను కళ్ళారా చూడడంతో అందరిలోనూ అనిర్వచనీయమైన అవ్యక్తానుభూతి గోచరిస్తుంది.

    ముందు గుంపుగా ప్రారంభమై....క్షణక్షణానికీ ఒక ప్రవాహంలా పెరిగిపోయారు అనాధ బాలలు...వారికి ముందుండి సారధ్యం వహిస్తుంది చందన.

    అందరిలోనూ తమ అన్నను మరింత దగ్గరగా చూడాలనే ఆరాటం...

    నల్లతంబి ఎలా ఉంటాడో చూడాలనే ఉత్సాహం కొందరిలో తొంగిచూస్తుంటే...మరికొందరు అతనిని పలకరించాలనీ....ఇంకొందరు అతని పాదాలను తాకి నమస్కరించాలని ఉబలాట పడుతున్నారు.

    ఒకప్పుడు అన్నకు కుడిభుజంలా వున్న మురుగన్ ఇప్పుడు లేని లోతునీ...అతని స్థానాన్ని భర్తీ చేసింది చందన....

    తను అన్నకు తగిన ఉత్తమ ఇల్లాలిగా...అన్న లేని లోటును వదినమ్మ తీరుస్తూ....ఆర్తులయిన వారిని ఆదుకుంటూ నల్లతంబిని మరపిస్తూ....అతను చూపిన బాటలోనే నడుస్తున్నది చందన.

    క్షణక్షణానికీ మహా ప్రవాహంలా పెరిగిపోతున్న అనాధ బాలల గుంపుని చూసి పోలీసు అధికారులు సయితం కలవర పడిపోయారు.

    తెల్లని చీరలో మల్లె పువ్వులా మెరిసిపోతున్న చందన అనాధలకు ఒక దేవతలా...దివి నుండి దిగివచ్చిన దేవదూతలా....మరో నైటింగేల్ లా....మదర్ థెరిస్సాలా వాళ్ళకి మార్గదర్సకురాలిగా నిలిచింది.

    "నల్ల తంబి జిందాబాద్"

    "మా మంచి అన్న రాజశేఖర్ వర్ధిల్లాలి"

    "అనాథ బాలల పెన్నిధి జిందాబాద్..."

    "నల్లతంబి వర్ధిల్లాలి.."

    నినాదాలు మిన్ను ముట్టాయి.

    పోలీసు అధికారులు బిత్తరపోయారు.

    చాలాకాలం తరువాత ఎదుతపడిన తన దేవుడిని చూసిన చందన కళ్ళలో నీరు ఉబికింది...ఆమె మనసు ఉద్వేగానికి లోనయింది.

    రాజశేఖర్ లో నిర్లిప్తత....

    ఇప్పుడతని హృదయం ఎంతో తేలిగ్గా ఉంది.

    అంత వరకూ బడబాగ్నిలా రగులుతున్న అతని హృదయం సేదతీరింది.

    తనను అంతా నిరసిస్తారనుకున్నాడు...కానీ, అందుకు భిన్నంగా తన సోదరులు...అనాధ బాలలు తనను అందలం ఎక్కిస్తున్నారు.

    ఇది చాలు... జీవితానికి!

    అతని కన్నీటి పోరాలకావల ఎందరో చిన్నారులు చిరునవ్వుతో చిపిగా ఆడుకుంటూ జీవితం ఎడల ఆశగా.... దేశానికి కావలసిన భావితరాల భావి భారత పౌరులుగా తమ జీవితాలను మలుచుకుంటున్నట్టుగా...అలా అని అతని ముందు ప్రతిజ్ఞ చేస్తున్నట్టు....ఇంకా ఏదో....మరింత ఉద్వేగానికి గురయ్యాడు నల్ల తంబి.

    అతనిలో అంతర్మధనం స్పష్టంగా కనిపిస్తుంది.

    అప్పటికే కళ్యాణ్ కుమార్ చేతులలో ఫింగర్ ప్రింట్స్ తీసిన పేపర్లులున్నాయి. అతను తన దగ్గర ఫైలులోని వేలి ముద్రలతో పోల్చి చూశాడు. రెండూ ఒకలానే ఉన్నాయి. కమెండో అన్న సంతకాన్ని కూడా టాలీ చేశాడు. రెండూ సరిపోయాయి. నో డౌట్ హి ఈజ్ కమెండో అలియాస్ రాజశేఖర్....అలియాస్ అధికారి అలియాస్ కళ్యాణ్.

    అప్పుడే జరిగిపోయిందొక సంఘటన....

    జనంలో నుంచి లేచి నిలబడ్డాడు ఒక మధ్య వయస్కుడు....ఎందుకు నిలుచున్నాడా అని చూస్తున్నంతలోనే అతని చేతిలోని రివాల్వర్ పేలింది. క్షణంలో వెయ్యవ వంతు వేగంతో బుల్లెట్ సూటిగా పోయి డయాస్ మీదఉన్న రాజశేఖర్ ఛాతీలో దిగబడింది.

    రాజశేఖర్ గొంతులో నుంచి ఆర్తనాదం....

    జరిగింది ఏమిటో అర్ధమయిన పోలీసులు జనం వైపు తిరిగేటప్పటికే పారిపోతున్న వ్యక్తి కనిపించాడు. ఎంతో దూరం పోకముందే అతనిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అతను ప్రతిఘటించే ప్రయత్నం చేయకపోవడంవల్ల తేలికగానే పట్టుకోగలిగారు. అతని దగ్గర ఉన్న రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు.

    అన్నిటికన్నా ఆశ్చర్యం కల్గించే విషయం ఏమిటంటే....అతను ఎవరో కాదు....ఒకప్పుడు రాజశేఖర్ రాజసాన్ని సహించలేని అతని ఏకైక ప్రత్యర్ధి శంకర్ నాగ్....తను చంపింది రాజశేఖర్ ను కాదని తెలుసుకున్నాడు కాబోలు పోలీసులకు పట్టుబడి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి విడుదలై అతని కోసమే ఎదురు చూస్తూ పగను పెంచుకుని ఉన్న నిజమైన విరోధి అతను!

    డయాస్ మీద ఒరిగిపోయిన రాజశేఖర్ మీదే ఉన్నాయి అందరి చూపులు...

    అనాధ బాల బాలికలకు, తల్లిదండ్రుల చేత నిర్లక్ష్యం చేయబడిన దగాబడిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళకు సమాజంచేత బహిష్కరింపబడిన వీధి వంచితులకు...ఇంకా ఏదో గొప్ప మేలు చేయాలని....తల్లిదండ్రులను ఇంకేదో సందేశం ఇవ్వాలని...ఏదో చెప్పాలని అస్పష్టంగా కదులుతున్న అతని పెదవులు ఆగిపోయాయి.

    అతని నాడి చూసిన కళ్యాణ్ కుమార్ హతాశుడై పోయాడు.

    ఇప్పుడు రాజశేఖర్ కళ్ళు నిర్లోప్తంగా శూన్యంలోకి చూస్తున్నాయి.

    అధికారి అలియాస్ నల్లతంబి అలియాస్ రాజశేఖర్ అలియాస్ కళ్యాణ్ ఈజ్ నో మోర్....హి ఈజ్ డెడ్!

    విగత జీవుడై పడిఉన్న నల్ల తంబి చేతి వేలికి తళతళా మెరిసిపోతుంది డైమండ్ రింగ్....!

No comments:

Post a Comment