Thursday, January 17, 2013

Indira nuvvu....


నాకేమికావాలో నాకే తెలియని కామన. తెలీనిదాని కోసం ఆరాటం. అటువంటి సమయంలో ఇందిర పరిచయం.
ఎడారి గుండె మీద తుషారబిందు చిలకరింపు.
ఆమె ఆకర్షణీయమైన కనులు చిత్రంగా మాట్లాడుతుంటాయి.
వోకరినొకరు చూడాలనుకొని కల్పించుకొనే సందర్భాలు అనేకం. వెన్నెల తడిసి గాలి స్నిగ్ధతత్వాన్ని స్పర్శిస్తూ వెన్నెల వెలుతురు చీకటి కాంతి కళ్ళనిండా అద్వైతించిన రససిద్ధి.
జీవితంలో అన్నీ రసవత్తరమయిన ఘట్టాలుండవు. ఒక్కొక్కక్షణంలో మహత్తరమయిన అనుభవం కలగవచ్చు. ప్రథమంగా ఆమెను చూసినప్పుడు, వోకర్ని వొకరు వెతుక్కుంటూ గుర్తించి కలుసుకున్నట్లు కళ్ళు మెరిసిన క్షణం, అదే మహత్తర అనుభవం!
ఇందిర ఇంటిగేటు కీచు శబ్దంతో తెరచుకుంటుంది. ఇక్కడ కంటిరెప్పల కిటికీలోంచి విచ్చుకుంటాయి. అనంగుడి నీలోత్పలం మనోతల్పాన్ని తాకుతుంది. దిగంతాల చూపులు ఆమెను చుట్టివేస్తాయి. లోతైన ప్రమఝారి, కాలశూన్యత. ఆమె సమీపంలో కలిగింది.
భౌతికం కాని సామీప్యత భౌతిక, మానసిక తాళాలను అధిగమించి ఆధ్యాత్మిక కామన అనుభవం.
ఓషో చెప్తారు 'ప్రాకృతిక శరీర పరిమళాలకు వ్యక్తులు పరస్పర ఆకర్షితులౌతారు. ఏదో రసాయనిక క్రియలవలెనే ఇద్ద్దరు వ్యక్తులు క్షణకాలం ఆకర్షితులవుతారు. సహజ పరిమళాలను మనం డియోడరెంట్స్ తో ఛిన్నాభిన్నం చేసుకుంటాము. పశుపక్ష్యాదులు పరిమళాల వలెనే ఆకర్షితులయి ఆనందం అనుభావిస్తుంటాయి. అదే మానవ విషాదం.
చిత్రమైన మౌనభాషలో కనులు మాట్లాడుకుంటాయి. పరస్పరానురాగం అనిర్వచనీయమై కలుగుతుంది. ఎదురుగా పక్షులు ఎగురుతుంటే ఏదో ఒక చిలుకగానో పక్షిగానో అయి ఎగురుతుంటే ఎంతో సంతోషంగా వుందును, గదా అని మనసు ఆశపడుతుంది.
నిజంగా వాటిల్లో సంతోషం వుందో లేదో లేక వాటి స్వేచ్చావిహారం, ఆకాశయానం, చెట్ల కొమ్మలపై కబుర్లు చెప్పుకుంటూ కూచోడం ముచ్చటేస్తుంది. వాటి మనోస్థితి శాంతంగా వుంటుందేమో! అనిపిస్తుంది.
జీవనంలో అనుభవం క్షణికమే! అనుభవాల క్షణాలమీద బతుకు నడుస్తుంది. అదే మనసు కల్పించే మాయ.
            ******
ఏదో సాధించాలనే తపన వలన జీవితం సీరియస్ అయిపోతుంది. గడిచిన జీవితపు నీడలు దిగులు పెడుతుంటాయి. ఏదో సాధించాలనే ఆశయాలవలన, సాధించినది కనబడక ఇంకా ఇంకా పొందాలనే ఆరాట, వృత్తిగా జర్నలిజం ఎన్నికోవడం చీరాల రామారావుగారి చలవే! అదే ప్రవృత్తికి కొంచెం దగ్గర అనిపించింది. రామారావుగారు నిబద్ధతకు మారుపేరు, ఆయన 'హిందూ' ఫీచర్లకు జాతీయస్థాయిలో మంచి స్పందన వస్తుంది. నా డిగ్రీ పూర్తికాగానే "న్యూస్ కంట్రిబ్యూటర్''గా నా నియామకం ఆయనే తెప్పించారు. జర్నలిజం 'ఓనమాలు' ఆయన దగ్గరే నేర్చుకున్నాను. వైవిధ్యమైన న్యూస్ కవరేజి ఆకర్షణీయంగా వుండటంలో నన్ను 'సిటీబ్యూరో'కి ప్రమోట్ చేసి, బదిలీ చేసారు.
సిటీలో జీవితం కాలనీలోనే మొదలయింది. ఎయిర్ పోర్టుకు దగ్గరవడంతో బహుళ అంతస్తులు లేవు, రియల్టర్ల కన్నుబడని కాలనీ.
గణపతి, ఆంజనేయ దేవాలయాలు ఓకే ప్రాంగణంలో వున్నాయి. దేవాలయాలు, ఎదురింటిలో నేను, దేవాలయం ప్రక్కగా ఇందిర కుటుంబం. మా ఇంటి ప్రక్కనే వీరయ్య ఇస్త్రీషాపు. దాని పక్కనే రేషన్ షాపు. వీరయ్య షాపు ముందు పెద్ద చింతచెట్టు, చెట్టు నీడలో మూడు నాలుగు కూర్చునే బల్లలు వుంటాయి. పిచ్చాపాటికి కూడలి. వీరయ్య ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. పగలు ఒక రకమయిన ఫిలాసఫీ, రాత్రిళ్ళు నిర్వేదమైన వేదాంతం. ప్రాకృతంలో వుంటుంది 'మడిసంటే బియ్యం ఖర్చు చేసే యంత్రమే. బాబు ఎన్ని ఎకరాలు పండించినా కరువే. గద్దె ఎక్కాలన్నా, గద్దె మీద వుండాలన్నా రెండు రూపాయలకే కిలో బియ్యం అని గొంతు చించుకు చెప్పాల్సిందే'' అని అధిక్షేపించేవాడు/.
షాపు దగ్గర కూర్చున్నప్పుడు కాలనీ విషయాలు సంక్షిప్తంగా చెప్పుకుపోతుంటాడు. పెద్దింటి విషయాలు, పేవ్ మెంట్ విషయాలు అన్ని చెప్తుంటాడు.
పత్రికాఫీసుకు ఆలస్యంగా వెళ్లటం వలన ఉదయం చాలా తీరుబాటుగా షాపు దగ్గరే చెట్టుక్రింద కూచోడం అలవాటయింది.
కాకతాళీయమో, ఆయాచితమో నేను కో౯చున్న సమయంలోనే ఇస్త్రీబట్టల కోసం వచ్చి ఇందిర నిలబడేది. కొద్దిసేపు వున్నాక, వీరయ్యను బట్టలు తెచ్చివ్వమని చెప్పి వేల్లిపోఎడు. నా కోసమే వచ్చి వెళ్ళినట్లుండేది.
సయోగాలకీ, వియోగాలకీ, రెంటికీ మధ్య వ్యక్తమయి బాధించిన భావాలకీ సంకోచాలకీ విచారాలకీ సాఫల్యం ఏమైనా వుందా?
యింటి ముందు వెళ్తూ నా వంకే చూస్తుండేది. ఒక ఆత్మీయమయిన మాధుర్యమైన అనుభవం. ఏమిటా ఆకర్షణ? ఏమిటా? ఆశ? నిముషంలో మనసుకే అర్థమయే సంకేత భాష పురుషున్ని వెతుక్కోవడానికి స్త్రీ చూపులు అదో విధంగా అందంగా తయారవుతాయి. చూపులు ఆకర్షణీయంగా మనోజ్ఞంగా వుంటాయి.
ఆమెను చూడాలని ప్రతి నిముషం హృదయం దహించేది. దినచర్య ఆమె చూపులతోనే మొదలయేది.
నేను ఆఫేసుకూ బయల్దేరేపుడు నా స్కూటర్ శబ్దానికి బయటకు వచ్చేది. వీడ్కోలు చూపులు నన్ను తాకేవి. ప్రాకృతిక పరిమళాలు గుబాళింపులు ఆకర్షతుడయ్యానేమో!
            *****
కొత్త కొత్త పత్రికల పుణ్యమాని ప్రింట్ మీడియాలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి, యాజమాన్యపు పోటీలో జర్నలిస్టులకు మంచి 'హైక్'తో ఆఫర్లు రావడం ఊహించనిది. జీతాలు బాగా పెరిగాయి. కారు తదితర సౌకర్యాలు పెరగటంతో కొంచెం పెద్ద ఇంటిలోకి మారటం అనివార్యమైంది. కాలనీలోనే రెండు లైన్ల అవతల మారటం జరిగింది. ఒక చోటి నుండి పీకి మరో చోట నాటిన మొక్కలాగా అయింది పరిస్థతి.
చిత్తశుద్ధి గల పత్రికా రచయితకి పత్రిక రచనా కత్తిమీద సాము అయిపొయింది. బాధ్యతలు పెరిగి సమయం కుంచించుకుపోయింది.
జీవితమంటే స్ట్రగుల్. జీవితాన్నుంచి, సమాజం నుంచి అపజయం అంగీకరించడం. నా స్వభావం కాదు. కష్టపడటం, జీవితాన్ని అర్థయుక్తం చేసుకోవాలనే సాధన పట్టుదల సక్సెస్ కారణం అని నా భావన.
ఆమెను చూడాలనే తపన ఆతృత వున్నా కాలానికి బందీ అయినాను.
రాజకీయ చైతన్యంతో సెన్సేషనల్ వార్తలు తాజా అందించాలి. సిటీ బ్యూరో చాలా అలర్ట్ గా పని చేయవలసి వస్తుంది.
ఇందిరను చూసి చాలా చాలా రోజులయింది. దాదాపు ఆరు నెలలయింది. ఒకటి రెండు సందర్భాలకు వెళ్ళి వచ్చినా ఆమె కనబడలేదు.
ఎప్పటిలాగే వీరయ్య షాపు దగ్గరకు వెళ్ళాను. చేస్తున్న పని ఆపుకొని వచ్చి పక్కన నిలబడ్డాడు వీరయ్య.
'
చాలా రోజులయింది బాబు తమర్ని చూసి ...'
నా కళ్ళు ఇందిరకోసం వెతుకుతున్నాయి.
నన్ను చూసి బయటకు వస్తుందేమోనని ఊహ.
ఇందిర గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ కనబడింది. వెంటనే లేచి గుడిగేటు దగ్గరకు వెళ్ళాను. ధ్వజస్తంభం దగ్గర ఆగింది. నా వైపు చూసింది. లోనికి వెళ్ళాను.
ప్రహారీ పక్కనే అరుగుమీద కూర్చుంది. నేను దగ్గరగా వెళ్ళాను. తల దించుకొని వుంది.
ముఖం కొంచెం పాలిపోయి వుంది. కళ్ళల్లో కాంతి చంద్రికలు లేవు కనులు జాలిగా బేలగా వున్నాయి.
ఆలోచనలను కరగించుకొని నిశ్శబ్దమైంది శరీరం.
మనసునిండా జ్ఞాపకాల ఊటలు మనిషిలో ప్రాచీన నిశ్శబ్దం ఆమె ముఖంలో అస్పష్ట అశాంతి.
నా చేతిలో చిన్న చీటీ వుంచింది. మునివేళ్ళతో చేతిని తాకి వడివడిగా వెళ్ళిపోయింది.
పరుగులాంటి నడక.
చీటీ విప్పి చూశా ...
"
నాకు 'ల్యుకేమియా' అన్నారు. అది బ్లడ్ కాన్సరట. మీతో మాట్లాడాలని వుంది''
లేచి నుంచున్నా, పట్టు తప్పింది శరీరం.
ఎక్కుతున్నావో, దిగుతున్నావో తెలీని స్థితి. అయినా కదలిక స్ఫురించింది.
'
సుకుమారంగా వున్న ఈమెకు అపరిమిత దుఃఖాన్ని మోయగల శక్తి ఎక్కడనుంచి వచ్చింది. నాకోసమై ఎంతగా వేచి వుందో గదా!'
మనస్సులో ఒంటరితనం ఎంత భయంకరం?
ఇందిర ఇంటివైపు నడిచాను.
ఇంటికి తాళం వేసి వుంది.
అంతలోనే ఎక్కడికి వెళ్ళినట్లు ఆశ్చర్యమేసింది.
వీరయ్య షాపు దగ్గరకు వెళ్ళి నిల్చున్నాను.
వీరయ్య పని ఆపి పక్కగా వచ్చి నిల్చున్నాడు.
'
బాబు ఇందిరమ్మ ...'' నీరు నిండిన కళ్ళతో వీరయ్య.
"
అసలు ఏమైంది వీరయ్య?''
"
బాబు మీరు వెళ్ళిన కొద్ది రోజులకే వారు ఇల్లు మారారు. తరువాత తెలిసింది బాబు, ఆమెకు సుస్తీ చేసింది వైద్యం ఖర్చులకోసం ఇల్లు అమ్ముకున్నారు. కాన్సరట!!''
కేవలం ఆరు నెలల్లో ఎంత ఘోరం!
"
మారిన ఇల్లు కనుక్కొని చెప్పు వీర్యా!''
నిస్పృహతో మౌనమైన జీవితం నిండా అశాంతి.
            *****
'
వెళ్ళిపోతున్నా' ఇందిర కళ్ళు నాపై నిలబెట్టింది.
నా చేతిని పట్టుకొని వూపింది.
మృత్యువును స్పృశించినట్లుంది.
శిథిలావవిష్టమైన శరీరం. ఎముకల గూడుపై కేవలం చర్మం కప్పివేత. కన్నీళ్ళు రాల్చిన ఆమె నేత్రాలు నిర్మలంగా వున్నాయి. నన్ను చూశాక నేత్ర పత్రాలు వికసించాయి.
ఆత్మిక భావన ఇంత గాఢంగా వుంటుందా!
హృదయంలో సానుభూతి ధైర్యమివ్వడం, ఓదార్పునిస్తుంది. జీవిచైతన్యం కడసారిగా నా చేతుల్లో కదలాడింది.
అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసుకొని తక్కువ సమయంలో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి తెచ్చిన మంజూరు పత్రాల్ని చైతన్యం కోల్పోయిన చేతిలో వుంచాను.
చేజారిన సమయం కలచివేసింది.
ప్రతి దీపపు కాంతి నక్షత్రాలవేపు అనంతంగా ప్రయాణిస్తుందంటారు. మానవ హృదయంలో ఉద్భవించే గాఢవాంఛలు తీవ్రభావాలు ప్రేమానురాగాలు మనుషులు పోయినా దిక్కులోనే హృదయాలలోనే వెలుగుతుంటాయేమో!
నిర్మలత్వం ఆమె ముఖం మీద నిలిచిపోయింది.
చివరి వీడ్కోలు ఇంత నిశ్శబ్దంగా వుంటుందని ఊహించలేదు.
నా భుజం మీద ఎవరిదో చేయి పడుంది.
తలెత్తి చూశాను.
నా చేతిలో కాగితం వుంచారు.
విప్పి చూశాను.
"
నా కనులు ఎప్పుడూ మిమ్మల్ని వెతుకుతుండాలి నా కళ్ళు బాంక్ లో అప్పగించండి. ఎవరి ద్వారానైనా మిమ్మల్ని చూస్తుండాలి''' - ఇందిర.

No comments:

Post a Comment