అక్కడ చప్పట్లు మారుమ్రోగాయి!
పోలీసు అధికారులంతా తెల్లముఖాలు వేశారు.
ఏ.ఎస్.పి. కుమార్ తన దగ్గర ఉన్న సస్పెక్ట్ ఫైలులోని ప్రతి షీట్ లో అన్ని వివరాలు పూర్తిగా రాశాడు.
అంటే పూర్తిగా ఇన్ వెస్టిగేషన్ చేసి అన్నీ వివరాలతో సస్పెక్ట్ ఫైల్ లో రాసిన తరవాతే దానిని బహిరంగపరచాడు.
షీట్ నెంబర్ టూలో ఉన్న బాడీ డిస్క్రిప్షన్ లో తనకు తెలిసినంత వరకూ నోట్ చేశాడు.
ఏజ్ కాలమ్ దగ్గరకు వచ్చేసరికి 30/1994...31/1995 ...32/1996...అలా ప్రస్తుతం 55/2019 అని కోట్ చేశాడు.
యాభై ఐదు ఏళ్ళున్న రాజశేఖర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో...? షీట్ నెంబర్ ఫైవ్ లో అసలు రాజశేఖర్ ఎలా నేరస్తునిగా మారాడో వివరించబడి ఉంది. షీట్ నెంబర్ నైన్ లో ఐదేళ్ళనాటి రాజశేఖర్ ఫోటో అతికించబడి ఉంది.
అలానే అతని బంధువుల వివరాలలో రిటైర్డ్ అడిషనల్ ఎస్సీ ధీరజ్, మరియు ఏ.ఎస్.పి. కుమార్ వివరాలు కూడా వ్రాయడం జరిగింది.
"మైడియర్ నర్స్ ....లేడీస్ అండ్ జంటిల్ మన్....మీకు తెలియని ఇంకొక విషయం చెప్పమంటారా..." అని క్షణం మౌనం వహించాడు.
"రికార్డ్స్ లో నా పేరు కుమార్ అనీ గార్డియన్ ధీరజ్ అని ఉంది. కానీ నేను నా తండ్రిపేరు దగ్గర కళ్యాణ్ అలియాస్ రాజశేఖర్ గా నమోదు చేయించడమే కాకుండా నా పేరు ముందు కళ్యాణ్ ను చేర్చుకున్నాను. ఇక నుంచి నన్ను కళ్యాణ్ కుమార్ గా పిలవవచ్చు"
అప్పుడే జరిగిపోయింది ఊహించని ఒక సంఘటన!
ఉన్నట్టుండి గుబురు గడ్డం, మెరిసిన జుట్టుతో కాషాయరంగు పంచ, లాల్చీతో వున్న వ్యక్తి ఒకరు లేచి నిలబడి వేదికవైపు వచ్చాడు.
సెక్యూరిటీవాళ్ళు అతనిని డయాస్ పైకి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం చూసిన ఏ.ఎస్.పి. కళ్యాణ్ కుమార్ ఆయనను వదలమని సైగ చేశాడు.
ఆ వ్యక్తి డయాస్ మీదకు వచ్చాడు.
"నాకు చిన్న అవకాశం ఇవ్వండి ఏ.ఎస్.పి. గారూ..."అన్నాడతను.
కళ్యాణ్ కుమార్ మౌనంగా తల ఊపాడు.
ఆ వ్యక్తి జేబులో నుంచి ఒక పేపరు తీసి ఎడమ చేతితో రెండు లైన్లు వ్రాసి కళ్యాణ్ కుమార్ చేతికి ఇచ్చాడు.
"పోలీస్ ఆర్ నాట్ ఫూల్స్....కమెండో" ఆ కాగితం చదివిన కుమార్ దిగ్బ్రాంతి చెందాడు.
అతను ఆ ఆశ్చర్యం నుంచి ఇంకా కోలుకోకముందే ఆ వ్యక్తి డయాస్ మీద ఒకవైపు ఉన్న మంచినీళ్ళ గ్లాసులోని నీటిని త్రాగి కుమార్ ముందు ఆ ఖాళీగ్లాసును పెట్టాడు-
"సర్...ఇప్పుడు ఈ గ్లాసుమీద నా వ్రేలిముద్రలు పడ్డాయి. డెవలప్ చేయించండి. అలాగే 'కమెండో' అన్న స్లిప్ ను నేను నేరం చేసినా ప్రతిచోట ఎడంచేతితో వ్రాసి పడేశాను. నేను మీకు వ్రాసి ఇచ్చిన స్లిప్ తో పాతవాటిని పోల్చిచూడండి. మీ పరిశోధన ఫలిస్తుంది...."
ఆ వ్యక్తి మైక అందుకున్నాడు.
అతను డయాస్ మీద ఉన్న వారందరినీ ఒకసారి కలయజూసి గొంతు సవరించుకున్నాడు.
"డియర్ సర్స్ అండ్ మైడియర్ ఫ్రండ్స్ మరియు చిట్టి తమ్ముళ్ళు, చెల్లెల్లారా ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్న నేను ఎవరో మీకు తెలియాలి. ఐయాం కమెండో. పలు రైల్వే నేరాలు చేసి చట్టానికి దొరక్కుండా తప్పించుకున్న రైల్వే గజదొంగ అధికారిని అలియాస్ రాజశేఖర్ అలియాస్ కళ్యాణ్ ని నేనే..."
అంతే...! తమ కాళ్ళక్రింద డైనమైట్ ప్రేలినట్టు అధికారులంతా నిర్ఘాతపోయారు.
"ఎస్...ఐయాం దట్ రాజశేఖర్....పోలీసు రికార్డులలోకి ఎక్కిన రైల్వే గజదొంగ కమెండోను నేనే! శ్రీనివాసన్ అనే ఒక ఆత్మీయుడు నాకోసం తన ప్రాణాలను బలిపెట్టుకున్నాడు. అతని త్యాగంలో దిమ్మెర పోయిన నేను నా ఐడెంటిటీని బయటపెట్టుకోలేక__స్టేట్స్ కు వెళ్ళకుండానే ఇక్కడే ఇంతకాలం అజ్ఞాతంగానే బ్రతికాను. కారణం నా వల్లనే సంజీవి గర్బవతి అయిన విషయం అప్పుడే తెలిసింది. అందుకే ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళలేక నాలో నేనే కుమిలిపోయాను. నెలలు నిండి ఒక బిడ్డకు ప్రాణంపోసి తను ప్రాణాలను విడిచినప్పుడుకూడా నా ఉనికిని బయటపెట్టడానికి నాకు ధైర్యం చాలలేదు. పురిటిలోని పసికందును నా తండ్రి ధీరజ్ తీసుకెళ్ళి దిక్కులేని ఒక అనాధ బాలుడిగా పెంచుతున్నప్పుడు కూడా నా గొంతు పెగలలేదు....కారణం....
"నా తండ్రి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్. వారి కీర్తి ప్రతిష్టలకు భంగంకలుగుతుందేమోనని ఉపేక్షించాను. కాని ఇప్పుడు నా కన్నబిడ్డ కళ్యాణ్ కుమార్ ఒక నేరస్తుదయినా తండ్రిని....తన తండ్రిగా నలుగురి ముందు గొప్పగా చెప్పుకున్నప్పుడే నా కళ్ళకు అడ్డుపడ్డ తెరలు తొలగి పోయాయి. మంచికోసం, పేరు ప్రఖ్యాతులకోసం పాకులాడే ఈ రోజులలో తన ఉద్యోగానికి, గౌరవ మర్యాదలను చెరుపు కలుగుతుందేమోనని నామమాత్రంగా కూడా ఆలోచించకుండా నేరస్థుడనైన నన్ను తన కన్న తండ్రిగా చెప్పుకోవడమే కాకుండా తన హృదయంలో నాకున్న స్థానాన్ని తెలియచెప్పాడు నా కొడుకు. అంతటి మహోన్నతుడి ముందు లొంగిపోవడానికే నేను వచ్చాను..."
గొంతు గాద్గదికమైపోయి చెప్పడం ఒక నిమిషం ఆపాడు రాజశేఖర్. అంతే...
ఒక్కసారిగా ఆ సభా ప్రాంగణం అంతా కోలాహలం...
తెల్లని యూనిఫారమ్ లో ఉన్న శాంతినిలయం నుంచి వచ్చిన అనాధ బాలలలో ఉత్సాహం తొంగిచూస్తుంది.
వారి ఆనందానికి కారణం...తాము నిరంతరమూ దేవునిలా కొలిచే నల్లతంబి సజీవుడని తెలియడమే...!
తన జీవిత పర్యంతమూ అనాధ బాలల కోసమే శ్రమించి....కోట్ల కొద్దీ కూడబెట్టిన సంపదనంతా వీధి బాలలకే అంకితంచేసి తెరమరుగయిన త్యాగశీలి రాజశేఖర్....నల్ల తంబిగా చిన్నారి హృదయాలలో నిలచిపోయాడు.
తమ మధ్య లేడని విషాదసాగరంలో మునిగిఉన్న తరుణంలో ఇన్నేళ్ళ తరువాత ప్రాణాలతోనే తమ అన్న తమని అనుక్షణమూ దూరం నుంచి గమనిస్తూ శేషజీవితాన్ని గడుపుతున్నాడని తెలియడంతో వారి ఆనందోత్సాహాలకు అంతులేకుండా పోతుంది.